ఏమన్నా పడటానికి జానారెడ్డిని కాదు ... రేవంత్ రెడ్డిని, కేసీఆర్‌కు సీఎం వార్నింగ్
సిరిసిల్లలో శుక్రవారం జరిగిన బహిరంగసభలో తనపై బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం జనజాతర పేరుతో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మాజీ సీఎం భాష సరిగా లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనను వెంట్రుక కూడా పీకలేరంటూ కేసీఆర్ అంటున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేకుండా లాగేయగలరని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడినా ఊరుకుంటామని కేసీఆర్ అంటున్నారని.. తాను జానారెడ్డిని కాదని, రేవంత్ రెడ్డినంటూ హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానొంటూ వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడితే పడటానికి తాను జానారెడ్డిని కాదని రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
పదేళ్లు అధికారంలో వుండి.. తెలంగాణను దోపిడీ దొంగలుగా , అడవి పందుల్లా అడ్డగోలుగా దోచుకున్నారంటూ ఘాటు సీఎం ఆరోపించారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాలు విరిగిందని.. కూతురు జైలుకు వెళ్లిందని, అధికారం కూడా కోల్పోయిందని, ఆయనపై జాలి చూపించామని, కానీ ఇప్పుడు ఊరుకునేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ఎలాబడితే అలా మాట్లాడితే ఆయనను జైళ్లో పెడతామని.. కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కుగా ఓడించామని, కేంద్రంలో బీజేపీని అలాగే ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని.. వారి కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని సీఎం కొనియాడారు. ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని.. దీని ప్రకారం పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వుండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలే ఇచ్చారని రేవంత్ దుయ్యబట్టారు.
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారని.. ఈ క్రమంలో 750 మంది అన్నదాతలు మరణించారని, బాధిత కుటుంబాలను మోడీ పరామర్శించలేదని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు కావాలంటే.. 14 మంది ఎంపీలను గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు.
Comments
Post a Comment